లింగాయతం దేవుడు ఒక్కడే ఉన్నాడనే సిద్దాంతము అనుసరిస్తుంది (Lingayathism follows Monotheism) |
అంగము పైన, లింగ సాహిత్యమైన పిదప
స్థావర దైవాలకు మ్రొక్క కూడదు
తన పురుషుని వదలి అన్యులతో కూడిక తగునా?
కర స్థలమున దేవుడుండగా
ధరణిపైని ప్రతిష్థలకు మ్రొక్కితే
నరకంలో వుంచుతాడు మా కూడల సంగమదేవుడు/4 [1]
లక్కను తిని కరగే దైవాన్నెలా ఒప్పుకొనేదయ్యా
మంటను చూడగానే మొరిగే దైవాన్నెలా ఒప్పుకొనేదయ్యా
అవసరంవస్తే అమ్ముకొనే దైవాన్నెలా ఒప్పుకొనేదయ్యా
బెదిరినపుడు పాతిపెట్టే దైవాన్నెలా ఒప్పుకొనేదయ్యా
సహజభావుడు నిజైక్యుడు కూడల సంగమ దేవుడోక్కడే దైవం. /17 [1]
ఎల్లప్పుడూ లోకుల ఇళ్ళవాకిళ్ళ వద్ద
కాచుకొని వుంటున్నాయి కొన్ని దైవాలు
పోమ్మన్నా పోవు
కుక్క కన్నా హీనం కొన్ని దైవాలు
లోకులను వేదించుకొని తినే కొన్ని దైవాలు
తామేమి ఈయగలవు కూడల సంగమదేవా./33 [1]
ఇరువురు మువ్వురు దేవుళ్ళని రెచ్చిపోయి మాట్ళాడకు,
ఒక్కడే చూడండిరా, ఇర్వురనేది అసత్యం చూడుమా
కూడల సంగమదేవుడు గాక ఇహలేదన్నది వేదం./61 [1]
నాగశిలలు కనిపస్తే పాలు పోయమంటారు
నిజమైన పాముల్ని కనపడగానే చంపమంటారయ్యా
తినగోరే (ఆకలితో) జంగముడొస్తే పదపద మంటారు
నినలేని లింగానికె బోనం చేయమంటారయ్యా
మా కూడల సంగని శరణులను చూచి ఉదాసీనం వహిస్తే
రాతిని గ్రుద్దుకొన్న మట్టిపెళ్ళలా ఔతారయ్యా/148 [1]
జాగ్రతస్వప్న సుషుప్తుల్లో మరొకటి తలిస్తే
తలపందెం తలపందెం
పొల్లయితే దేవా తలదండం తలదండం
కూడల సంగమదేవా
మీరుగాక ఇతరుల తలిస్తే తలదండం తలదండం./204 [1]
దేవుడొకడు పేరుల అనేకం
పరమ పతివ్రతకు వరుడొకడే
మరొకరిపై వాలితే చెవిముక్కులు కోస్తాడు
పలువురు దేవతల ఎంగిలి తినేవాళ్ళ నేమనేది
కూడల సంగమదేవా!/230 [1]
నమ్మిన భార్యకు మగడొకడే చూడండిరో
నమ్మగల భక్తునికి దేవుడొకడే చూడండిరో
వద్దు వద్దు అన్యదైవాల సంగము! నీచం
వద్దు వద్దు పరదేవుల సంగము నీచం
కూడల సంగమదేవుడు చూస్తేనే ముక్కుకోసేస్తాడు చూడండిరో/241 [1]
నీళ్ళు కనిపిస్తే మునక లేస్తారయ్యా
చెట్టు కనిపిస్తే ప్రదక్షిణలు చేస్తారయ్యా
ఇంకిపోయే నీటిని, ఎండే చెట్టును
మెచ్చు కొనేవాళ్ళు మిమ్ము నెక్కడ తెలియగలరు
కూడల సంగమదేవా/257 [1]
భక్తుల్ని చూడగానే బోడులప్పిరయ్యా
సవణుల చూడగానే బిత్తల లప్పిరయ్యా
బాపనల చూడగానే హరినామ మంటారయ్యా
వారివారిని చూచనప్పుడు వారివారిలాగా!
లంజకు పుట్టిన వారిని చూపకవయ్యా
కూడల సంగయ్యను పూజించి అన్యదైవాలకు వ్రాలి
భక్తులనిపించుకొనే అజ్ఞానలను నేనే మందునయ్యా?/296 [1]
మట్టి మూకుడు దైవం, చేటదైవం, వీధిలో రాయి దైవం
దువ్వెన దైవం, వింటినారి దైవం కనండిరో
కొలతసేరు దైవం, చిరుచెంబు దైవం కనండిరో
దైవము దైవమే అంతా నిండి కాలూన చోటులేదు
దేవుడొక్కడే! కూడల సంగమ దేవుడు./309 [1]
విష్ణువును పూజించి భుజము కాల్పించుకొనడం చూచా
జినుని పూజించి బత్తలియగుటను చూచా
మైలారుని పూజించి కుక్కై మొరిగింది చూచా
మా కూడల సంగము పూజించి దేవా
భక్తులనిపించుకొనుట చూచా/357 [1]
శాస్త్రం ఘనమందునా? కర్మను భజిస్తుంది
వేదం ఘనమందునా? ప్రాణి వధను చెబుతోంది
శ్రుతులు ఘనమందునా? ముందుంచి వెతుకుతాయి
అక్కడెక్కడా నీవు లేవు కనుక
త్రివిధ దాసోహముల ద్వారా కాక చూడరాదు
కూడల సంగమ దేవుని!/364 [1]
శివజన్మలో పుట్టి లింగైక్యులై
తన అంగం మీద లింగం ఉండగా
అన్యులనే పాడి, అన్యులనే పోగిడి
అన్యుల వచనాలను పోగిడితే కర్మవదలదు భవబంధనం తప్పదు
శునకయోనిలో వచ్చుట తప్పదు
అందువలన కూడల సంగమదేవా
మిమ్ము నమ్మీ నమ్మని డాంభికులకు
ఇసుక గోడనుకట్టి నీట కడిగినట్లయినదయ్యా/366 [1]
అమృతసాగరంలోనే వుండి ఆవును గురించిన చింత ఎందుకు?
మేరువు మధ్యదాగి బంగరు పోడిని కడిగే చింత ఎందుకు?
గురునితో చేరి తత్వవిద్యల చింత ఎందుకు?
ప్రసాదంలో వుండి ముక్తిని గురించి చింత ఎందుకు?
కరస్థలాన లింగమున్న తరువాత
ఇంక వేరే చింతలెందుకు చెప్పరా గుహేశ్వరా?/ 451 [1]
అంగంపై లింగసాహిత్యమైన పిదప
తీర్థ క్షేత్రయాత్ర లెందుకయ్యా!
అంగం మీది లింగం స్థావర లింగాన్ని తాకితే
దేన్ని ఘనమనను! దేన్ని చిన్నదనగలను!
తాళ సంపుటానికిరాని ఘనం తెలియక చెడ్డారు
జంగమ దర్శనం శిరసు తాకి పావనం
లింగ దర్శనం కరం తాకి పావనం
దరిసున్న లింగాన్ని మిథ్య చేసి
దూరాననున్న లింగానికి మొక్కే
వ్యర్థవ్రతుణ్ణి చూపించకయ్యా
కూడల చెన్న సంగయ్యా /653[1]
అంగం మీద లింగదారణ మయ్యాక
మళ్ళి భవిని మిత్రుడని కలిపితే
కోండమారికి బలికావడం తప్పదు
పచ్చిమట్టితో చేసిన కుండ అగ్నిముఖం నుండి వచ్చాక
అది తన పూర్వకులాన్ని కలపుకుంటుందా?
అగ్ని దగ్ధ ఘట: ప్రాహొర్న భూయొ మృత్తికాయతే|
తచ్ఛి వాచార సంగేన నపునర్మానుషో భవేత్||
అందువల్ల, నాస్తి పూర్వకుదైన భక్తుడపూర్వుడు
కూడల చెన్న సంగమదేవా/654 [1]
సారభూత పదార్థాన్ని వెదకాలని
శరణుడు మర్త్యలోకానికి వచ్చి
తన ఇరవైఐదింద్రియాలను భక్తులను చేసి,
మెల్లమెల్లగా వారి పూర్వాశ్రయాలను తొలగించి
కల్పితం లేకుండా అర్పితం చేయగా
ఇంద్రియాలు తమతమ రీతిలో గ్రహించజాలక
కూడల చెన్న సంగనికి కావాలని పట్టుకొనే వున్నాయి./924 [1]
కట్టిన లింగాన్ని తక్కువుగా చేసి
కొండ మీద లింగాన్ని పెద్దది చేసిన పద్ధతిని చూడు
ఇలా ఉండే డాంబికులను చూస్తే
గట్టిగా ఉన్న పాదరక్షలను తీసుకుని
లొటలొటమని కొట్టమన్నాడు మన అంబిగర చౌడయ్య/ 1393 [1]
రాతి దేవుని పూజను చేసి
కలియుగాన గాడిదల్లా పుట్టారు
మట్టిదేవుని పూజించి, మానహీనులయ్యారు
కట్టెనే దేవుడుని పూజించి మట్టిలొ కలిశారు
దేవుణ్ణి పూజించి స్వర్గానికి చేరలేక పోయారు
జగద్భరియమైన పరమ శివునిలో
సేవకుడైన శివభక్తుడే శ్రేష్ఠుడన్నవాడు
మా అంబిగర చౌడయ్య/ 1395 [1]
పర్వత లింగాన్ని పెద్దది చేసి విలువనిచ్చే మూర్ఖులారా
వదలి పెట్టండి మీ ఇష్టలింగాన్ని
మా చేతికి ఇవ్వకపోతే
నట్టనడి నీటీలో పడేసి
కట్టి ముంచి
మిమ్ములను లింగైక్యులను చేస్తానన్నవాడు
మా అంబిగ చౌడయ్య/ 1407 [1]
బెల్లానికి చతురస్రం కాక తీపికి చతురస్రం ఉంటుందా
చిహ్నానికి పూజకాక జ్ఞానానికి పూజ ఉంటుందా
తెలివి జడమైతే చేతిలోని చిహ్నానికి
అక్కడే లోపం అన్నాడు అంబిగ చౌడయ్య/ 1408 [1]
కరస్థలంలోని లింగాన్ని వదలి
ధరలోని ప్రతిమలకు ఒరిగే
నరకపు కుక్కల నేమందునయ్యా
పరమ పంచాక్షరమూర్తి శాంత మల్లికార్జునా./ 1901 [1]
రాతిలో మట్టిలో చెట్టులో దేవుళ్ళున్నారని
ఎక్కెడెక్కడో యాతన పడే అన్నలారా వినండహో
అవన్ని అక్కక్కడ వుంచిన ఘనతకు గురుతేకాని
ఆతడు మాటల కతీతుడయ్యా
మనసెక్కడ వుంటుందో అక్కడే ఆతని వునికి
ని:కళంఖ మల్లికార్జునా/1981 [1]
లోక విస్తారమూ, నింగి విస్తారము
పాదము పాతాళము నుండి అట్టట్టు
మకుటం బ్రహ్మాండము నుండి అట్టట్టు
విశ్వ బ్రహ్మాండాన్ని తన కడుపున దాచుకొనియున్న
దేవుడిప్పుడు నా దైవం.
ఆ దేవునిలో నేను దాగి, నాలో ఆ దేవుడు దాగవున్నాము
ఇట్టి దేవుని నమ్మి "నేను" చెడి ముక్తుడనయ్యాను.
ఈ దేవుని ఎరుగక
జగమంతా రాతి దైవాలు, మట్టి దైవాలు, కొయ్య దైవాలని
వీటినారాధించి చెడినారే.
స్వర్గ మర్త్య పాతాళము వారందరూ
నా దేవుడి నెరుగి అర్చించలేదు,
పూజించలేదు, భావించలేదు.
ఇది కారణము, ఏ లోకము వారైనా కాని,
నా దేవుడినెరిగితే
భయము లేదు, బంధనము లేదు
నెర నమ్మితే, మన బసవప్రియ కూడల చెన్నబసవన్నా/2147 [1]
నాడు హనుమంతుడు సముద్రం లంఘించాడని
నేడు కోతి అరుగుల మీదుగా ఎగిరినట్లు
రాణిగారు మేడపై నెక్కిందని
దాసి తిప్పపై నెక్కినట్లు
రాకుమారుడు గుర్రమెక్కాడని
కోతి కుక్కపై నెక్కినట్లు
మదించిన ఏనుగు సోమవీధిని చెరలాడిందని
మదించిన మేక బోయలవీధి సొచ్చి గొంతు విరుచకొన్నట్లు
ఎదపై నున్న మగణ్ణి కాదని
పెరవూరి జారుని కొనియాడే జారిణిలా
కన్న కన్నవారి నంతా పూజించే భండముండల
ముక్కిడి మొగాలను చూడజాలము కాక చూడజాలము
శివుని సాక్షిగా
ఆఖండ పరిపూర్ణ ఘనలింగ గురు చెన్నబసవేశ్వర
శివుని సాక్షిగా!/ 2257 [1]
ఒడిని లింగము విడిచి గుడిని లింగము ముందు నిలిచి
పదముల లెక్కించే
తుంటరి (తాగుబొతు మాదిగల) ముఖము చూడకూడదు
అఖండ పరిపూర్ణ ఘనలింగ గురు చెన్నబసవేశ్వర
శివుని సాక్షిగా!/2258 [1]
అంగం మీద లింగం ధరించి
శివభక్తులని తెలిపి శివాచార మార్గం విడిచిపెట్టి
భవిశైవదైవాలకు లింగం నేల తాకేట్లు సాష్టాంగపడి
శరణమనే తొత్తులకు శివజన్మం ముగిసి
సూర్య చంద్రులున్నంత వరకూ ఇరవై ఎనిమిది కొట్ల నరకాలు తప్పవు
ఆ నరకాలు ముగియగానే శునక, సూకర జన్మలు తప్పవు
ఆ జన్మాలూ ముగిసిన పిమ్మట రుద్రప్రళయం తప్పదన్నాడు కనుమా
సంగన బసవేశ్వరుడు/2271 [1]
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*![]() | దేవలోకం మర్త్యలోకములని వేరుగా లేవు; భక్తుని ముంగలే వారణాసి, కాయకమే కైలాసం | ఇష్టలింగ స్వరూపం | ![]() |