సిద్ధరామేశ్వర

మకుటం కపిలసిద్ధ మల్లికార్జున
కాయకం: మహశివయోగి

మా ఒక వచన పారాయణానికి
వ్యాసుని ఒక పురాణం సమం కాదయ్యా
మా నూటెనిమిది వచనాల అధ్యయనానికి
శతరుద్రీయ యాగం సమం కాదయ్యా
మా సహస్ర వచనాల పారాయణానికి
గాయత్రీ లక్షజపం సమం కాదయ్యా
కపిల సిద్ధ మల్లికార్జునా/969 [1]

సిద్ధరామేశ్వర, సిద్ధరాముడు: పన్నెండవ శతాబ్ధినాటి ప్రథమశ్రేణి వచనకారుల్లో ఒకడు. ఈతని జీవితచరిత్రకు సంబంధించి అనేక ఆధారాలు, వచనం, కావ్యం, శాసనం, ఐతిహ్యలలో పుష్కలంగా లభిస్తున్నాయి. నాటి సొన్నలిగె (మహారాష్ట్రంలోని షోలాపుర) ఇతని జన్మస్థలం. తండ్రి ముద్దగౌడ, తల్లి సుగ్గలదేవి ఇంటిదేవుడు "ధూళి మాకాళ" (మహాకాళుడు) రేవణ సిద్ధుని వరప్రభావంతో పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టినపేరు ధూళిమాకాళుడు. తరువాత నాథసిద్ధ సంప్రదాయవర్తి కావడంతో సిద్ధరాముడని ప్రసిద్ధడైనాడు. బాల్యంలో ముగ్ధభక్తుడు. పశువులకాపరి. శ్రీశైలం వెళ్ళి మల్లన్న దర్శనం చేసికొన్నాడు స్వస్థలానికి వచ్చి దేవాలయం నిర్మించి ఆ ఆలయావరణకు యొగ రమణీయ క్షేత్రమని పేరు పెట్టాడు. లింగస్థాపన, ప్రజాళి ప్రశాంత జీవితానికై చెరువులు-కట్టలు కట్టించే కాయకానికి పూనుకొన్నాడు. కర్మయోగి అనిపించుకొన్నాడు. ప్రభుదేవుడు ఆతణ్ణి కల్యాణానికి కొనిపోయి చెన్నబసవన్నతో ఇష్టలింగ దీక్షనిప్పించాడు. అనుభవ మంటపగోష్ఠుల్లో పాల్గొంటూ మహశివయోగి అనిపించుకున్నాడు. కల్యాణంలో విప్లవం ముగిసిన పిదప తిరిగి సొన్నలిగెకి వచ్చి అక్కడే ఐక్యమయ్యాడు.

కులజుడినై నేనేమి చేయాలయ్యా?
కులం చెంత దేవుడవుకావు, మనసు కలిగిన దేవుడవే, సరి,
ఏయొనజుడైతేనేం?
నీవను గ్రహించిన వాడే కులజుడయ్యా
కపిల సిద్ధ మల్లికార్జునా - సిద్ధరామేశ్వర/995 [1]

కులమని పోరాడే అన్నలారా వినండోయి
డొక్కలునిది కులమా? మాదిగది కులమా? దుర్వాసునిద కులమా?
వ్యాసునిది కులమా? కులమా వాల్మీకిది? కులమా కౌండిన్యునిది?
కులం చూస్తే గొప్పలేదు
వారి నడత చూస్తే అలా నడిచేవారు ముల్లోకాలలో లేరు కనవొయి
కపిల సిద్ధ మల్లికార్జునా - సిద్ధరామేశ్వర/996 [1]

సిద్ధరామ వచనాలు, స్వరవచనాలు, బసవస్తోత్ర త్రివిధి, అష్టావరణ స్తోత్రత్రివిధి. సంకీర్ణ త్రివిధి మున్నగు వైవిధ్యమయ సాహిత్యాన్ని సృష్టించాడు. వచనాల్లో మరియు స్వరవచచనాల్లో "కపిలసిద్ధ మల్లికార్జున" అన్న అంకితముద్ర వుండగా త్రివిధి కృతుల్లో యోగినాథ అన్న అంకితం ముద్ర వుంది. మొత్తం 1162 వచనాలు లభించి విటిలో వైయక్తిక జీవన విశాషాలు, దర్మతత్వ జిజ్ఞాస, సామాజిక సంవేదన ప్రాధాన్యత వహించాయి.

తనువుతో దాసోహం చెసి గురు ప్రసాది అయ్యాడు బసవన్న
మనసుతో దాసోహం చెసి లింగ ప్రసాది అయ్యాడు బసవన్న
ధనంతో దాసోహం చెసి జంగమ ప్రసాది అయ్యాడు బసవన్న
ఇలా ఈ త్రివిధ దాసోహం చెసి
సద్గురు కపిల సిద్ధమల్లికార్జునా
మీ శరణడు స్వయం ప్రసాది అయ్యాడయ్యా బసవన్న - సిద్ధరామేశ్వర/1015 [1]

తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది
తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది
తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకకెక్కింది
తాను సృష్టించిన స్త్రీ నారాయణ ఎదకెక్కింది
అందువల్ల స్త్రీ స్త్రీ కాదు, స్త్రీ రాక్షసి కాదు
స్త్రీ ప్రత్యక్షంగా కపిల సిద్ధ మల్లికార్జునుడే కనవయ్యా. - సిద్ధరామేశ్వర / 1018 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousమారేశ్వరొడెయ(డు)శివనాగమయ్యNext
*