మరుళశంకరదేవుడు

మకుటం శుద్ధ సిద్ధ ప్రసిద్ధ ప్రభూ శాంతమల్లికార్జునా

సామాన్యరాలికి రంభత్వం ఉంటుందా?
సంభ్రమం అణిగినపుడు నవరసాంగముల కళ ఉంటుందా?
భక్తునికి సమయమను సంభ్రమం ఉంటుందా?
పరుసవేది దిశనుండి పాషాణత్వం మూసినట్లు నీవు వచ్చావు కదా!
శుద్ధ సిద్ధ ప్రసన్న ప్రభువా!
శాంత చెన్న మల్లికార్జున దేవయ్యా
ప్రభుదేవుని కారుణ్యంతో బ్రతికితిని.1927 [1]

మరుళశంకరదేవుడు: శరణుల కీర్తి వార్తలువిని అఫఘానిస్తాన్ (బర్బరదేశపు కణ్భత్తూరు గ్రామం) నుండి కల్యాణానికి వచ్చి బసవన్నగారి మహాగృహంలో గుప్త భక్తుడుగా 12 సంవత్సరాలున్న ఇతణ్ణి ప్రభుదేవుడు గురుతించి శరణులకు పరిచయించిన ఐతిహ్యమొకటుంది. శూన్యసంపాదనలో ఇది చెప్పబడింది.

సంసార సాగరాన్ని దాటేటప్పుడు
ఎరుకనే తెప్పను తెచ్చి
జ్ఞానమనే సరంగు తెప్పలో కూర్చోని
సుజ్ఞానమనే గట్టి గెడగకొయ్యను పట్టి
నేనీ వాగును చూచి సరంగు నడిగితే
నేను దాటిస్తానన్నాడు
నేను నిన్ను నమ్మి తెప్పనెకా సరంగన్నా అని
నేను తెప్పెక్కి కూర్చోని వాగులోకి పోబోతే
కామమనే పెద్ద మొద్దు అడ్డుపడింది
క్రోధమనే సుడిగుండంలో
అహంకారమనే తిమింగలం వచ్చి నిలిచింది
మాయ అనే మొసలి నోరు తెరుచుకొని వుంది
మొహమనే గడుసు అలలు లేచి పడుతున్నాయి
లోభమనే చీకటి సంద్రంలోనికి లొక్కొంటోంది
మరపు అనే గర్జన తోస్తూ వున్నది
మత్సరమనే సుడిగాలి తలక్రిందులు చేస్తోంది
వీటన్నిటినీ పరిహరించి
నన్ను నదిని దాటించాడు సరంగు
ఈ నదిని దాటించిన సరంగు కూలకై నన్నడగ్గా
కూలి ఇవ్వడానికేమీ లేదంటే
చేతులు కట్టి నన్ను లాకెళ్ళాడయ్యా
అరువిచ్చిన కూలికి తన పశువుల్ని కాయించాడయ్యా
తెలియక తెప్పను ప్రవాహం దాటించిన కూలికి
పశువుల కాచాను కనుమా!
శుద్ధ సిద్ధ ప్రసన్న ప్రభూ
శాంత చెన్న మల్లికార్జున దేవయ్యా
మీ దయ, మీ దయ, మీ దయ! /1926 [1]

ప్రసాది స్థలంలో వుండిన మరుళ శంకరదేవుడు "శుద్ధ సిద్ధ ప్రసిద్ధ ప్రభూ శాంతమల్లికార్జునా" అంకితముద్రతో 35 వచనాలు దొరికాయి వాటిలో ఆయన వైయుక్తిక మనిపించిన ప్రసాద తత్వానికి ప్రాధాన్యత లభించింది. దానితోబాటు శరణులస్తుతి, లింగవంతుల నిలువు మహాలింగైక్య యొక్క స్వరూపం, శీల చారిత్ర్యాల బోధలూ చోటు చేసికొన్నాయి. శరణుల్లో విశేషంగా ప్రచలితమైన శరణసతి-లింగపతి భావన ఇతనిలో "శరణసతి లింగసతి"గా వుండటం సూఫి పంథం యొక్క ప్రభావాన్ని సూచిస్తోంది.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousమేదర కేతయ్యమనుముని గుమ్మట దేవుడుNext
*