కాడ సిద్దేశ్వర

మకుటం కాడనొళగాద (కాటిలో వెలసిన) శంకరప్రియ చెన్న కదంబలింగ నిర్మాయప్రభువా
కాయకం: మఠం పీఠాధిపతి

జీతగానికి ఏడాది చింత
భటులకు నెల చింత
కూలివారికా రోజు చింత
చేరిన పిన్న పెద్దలకు అన్నపు చింత
లింగైక్యుడైన శరణునికి తన దేహపు చింత
కాటిలోనున్న శంకరప్రియ చెన్నకదంబలింగా! నిర్మాయప్రభూ. /2238 [1]

కాడ సిద్దేశ్వర: ఇతడు మహారాష్ట్రానికి చెందిన సిద్ధగిరి మఠం తాలూకు సంప్రదాయానికి చేరిన పీఠాధిపతి కాలం క్రి.శ.1725. "సంగమేశ్వర దేవుని కరకమలంలో ఉత్పన్నుడైన శిశువునేనయ్య" అని చెప్పుకొన్నందువల్ల, సంగమేశ్వర దేవుడు ఇతని గురువై వుండాలి. జాయప్ప దేశాయి రచన కువలయానంద కృతిలో ఇతని ప్రస్తావన వుంది "వీరశైవ షట్థ్సలాను గుణంగా పేర్చబడ్డాయి. వచనాంకితముద్ర "కాడనొళగాద (కాటిలో వెలసిన) శంకరప్రియ చెన్న కదంబలింగ నిర్మాయప్రభువా" అన్నది. చాలావరకు అన్ని వచనాలు వెడగు (మార్మిక) పరిభాషలో ఉన్నాయి షట్థ్సల సిద్ధాంత ప్రతిపాదనమే ఈ వచనాల పరమలక్ష్యంగా వుంది. ఈ కృతిలో ప్రత్యేకంగా తోచే విషయమేమంటే మధ్యమధ్య ఇతర శరణుల పేర్ల క్రింద వారివారి కాయకాల పరిభాషలు ఉపయొగించి వచనాలను అల్లడము. ఇక్కడ కనిపించే శరణుల్లో కొందరు 12వ శతాబ్దం వారైతే మరికొందరు, ఈవరకు ఎక్కడా ప్రస్తావింపబడనివారు. వారలో పింజారుల మహమ్మదు ఖానయ్య, నల్లి పీరణ్ణ అనే ముస్లిం శరణుల పేర్లు కూడ వుండటం గమనార్హం, మరీ విశేశమేమంటే ఈ వచనాల్లో కొన్ని ఉర్దూ భాషలో ఉండటం.

చదివితే చదవవచ్చు అల్పజ్ఞుల ఎదుట
రాజు, ప్రధానుల్లాంటి మాన్యుల ముందు చదువలేముందు
అంధుని చేతికి అద్దమిస్తే
చూడగలడా కన్నులున్న వాడు గాక!
పుట్టిన వారెరుగుదురు పుట్టని వారు ఎరుగరు
కాటిలోనున్న శంకరప్రియ చెన్నకదంబలింగా! నిర్మాయప్రభూ. /2241 [1]

మగనికొక లింగం మగనాలి కొకలింగం
బిడ్డలకొక లింగం మిత్రులు, చెలికాళ్ళ కొకలింగం
ఇలా నల్వురికీ నాలు లింగ తత్వాలుంటే
భవమాల తెగదు
ఈ నల్గురికీ ఒకే లింగమైతే
భవమాల తెగుతుంది చూడరా
కాటిలోనున్న శంకరప్రియ చెన్నకదంబలింగమా! నిర్మాయప్రభూ. /2242 [1]

గురువంటే నశిస్తుంది భవగజం
గురువంటే తొలగుతుంది బహుజన్మల దోషం
గురువంటే మూన్నూటరువది నాళ్ళ రోగబాధలు చచ్చిపోతాయి
గురువంటే కాల, కామ, మాయాదుల ముళ్ళు కాలిపోతాయి
గురువంటే సకలైశ్వర్యాలు దొరికిపోతాయి
ఇటువంటి గురువుగారి శ్రీ చరణాలకు తలవంచి
నమోనమో అని బ్రతికానయ్యా
కాటిలోనున్న శంకరప్రియ చెన్నకదంబలింగమా! నిర్మాయప్రభూ. /2243 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousజోదర(జోదుల) మాయణ్ణకాలికణ్ణి (కాలకంటి ) కామమ్మNext
*