Previous చందిమరసు డోహర (డొక్కల) కక్కయ్య Next

చెన్నబసవన్న

మకుటం కూడల చెన్న సంగమదేవ
కాయకం: గురువు, ద్వితీయ శూన్య పీఠాధీశ

*

బసవన్న మర్త్యలోకానికి వచ్చి మహాగృహాన్ని నిర్మించి
భక్తి జ్ఞానాలనే దీపమెత్తి చూపగా
సుజ్ఞానమనే ప్రభ ప్రసరించిందయ్యా లోకంలో
వెలుగులో తెలిసి చూడండి
విడిపోయిన శివగణమంతా చేరి ఒక్కటైందయ్యా
కూడల చెన్న సంగమదేవా
మీ శరణ బసవన్న కృపతో
ప్రభుదేవుల నిజమెరిగి నిశ్చింతులయ్యారయ్యా
శివగణమంతా -చెన్న బసవన్న/840 [1]

పాతాళగంగను తాడులేక తేవచ్చునా?
సోపానాల బలంతోకాక తేవచ్చునా?
శబ్ద సోపానాలమర్చి మడిపారు పురాతనలు
దేవ లోకానికి దారిని, చూడండిరా
మర్త్యుల మనోమాలిన్యం పోగోట్టాలని
గీత పలుకులనే జ్యోతిని వెలిగించి ఇచ్చారు
కూడల చెన్న సంగని శరణలు/ 833[1]

చెన్నబసవన్న: ప్రభుదేవుని చేత అవిరళజ్ఞాని, స్వయంభూజ్ఞాని అనిపించుకొన్న చెన్నబసవన్న శరణ సముదాయంలో చిన్నవాడైనా జ్ఞానంలో అందరికన్నా మిన్నగా పేరు పడ్డాడు. అక్కనాగమ్మ చెన్న బసవన్న తల్లి శివదేవ(శివస్వామి) తండ్రి. జన్మస్థలం ’కూడల సంగమం’. ఇతడు కొన్నాళ్ళు బిజ్జళనివద్ద దండనాయకుడుగా నుండినవాడు. బసవన్న చెపట్టిన మహాకార్యంలో సక్రియుడై పాల్గొన్నాడు. సిద్ధరామునికి ఇష్టలింగ దీక్షనిచ్చాడు. ప్రభుదేవునికి పిమ్మట శూన్య పీఠాన్నధిరోహించాడు. బసవన్న బిజ్జళుని ఆజ్ఞ మేరకు కల్యాణం వదలి కూడల సంగమానికి వెళ్ళిపోగా, కల్యాణ విప్లవం (కల్యాణ క్రాంతి) తర్వాత శరణుల దండుతో ఉళివిని చేరుకొని అక్కడ ఐక్యమైతాడు.

బ్రాహ్మణుడు భక్తుడైతేనేమయ్యా? సూతక పాతకాలను విడువడు
క్షత్రియుడు భక్తుడైతేనేమయ్యా? క్రోధం విడువడు
వైశ్యుడు భక్తుడైతేనేమయ్యా? కపటం విడువడు
శూద్రడు భక్తుడైతేనేమయ్యా? స్వజాతిని విడువడు
ఇలాంటి జాతి డంభికులను మెచ్చుకుంటాడా కూడల చెన్న సంగమ దేవుడు -చెన్న్ బసవన్న/848[1]

తలమాసితే మహామజ్జనం చేయాలి
గుడ్డ మాసితే చాకళ్ళకు వేయాలి
మనసు మైల కడగాలంటే
కూడల చెన్న సంగయ్య శరణుల అనుభావం అభ్యసించాలి /862[1]

బసవన్న, ప్రభుదేవుళ్ళలాగే చెన్నబసవన్న ప్రతభావంతుడైన వచనకారుడు. "కూడల చెన్న సంగమదేవ" మకుటంతో వచనాలు వ్రాయడమేగాక "మంత్రగోప్య", "మిశ్రార్పణ", "కరణహసిగె" మున్నుగు లఘుకృతులనూ రచించి శరణ తత్వ ప్రతిపాదకుల్లో అగ్రగణ్యుడైనాడు. ఇప్పటికి ఈయనవి 1763 వచనాలు లభించాయి. షట్థ్సలతత్వ నిరూపణమే వాటి లక్ష్యం. అప్పుడే సరికొత్తగా రూపు దిద్దుకొంటున్న (శరణ) లింగాయత ధర్మానికి ఒక నిశ్చయమైన సిద్ధాంత చట్రం సమకూర్చడంలో చాల ఉత్సాహంగా పనిచేసి అది సార్వజనీకమూ మరియు సార్వకాలకమూ అయ్యెట్లు జాగ్రత్త వహించిని కీర్తి ఈయనకే దక్కాలి. అందువలన ఇతడు "షట్థ్సలబ్రహ్మి" షట్థ్సల చక్రవర్తి" అనే బిరుదలకు పాత్రుడయ్యాడు.

కర్మజాతుని తొలగించి గురులింగ పుణ్యజాతుని చేసిన పిదప
శివకులంకాక అన్యకులం శరణుని కున్నదా?
శివధర్మ కులేజాత: పూర్వ జన్మ వివర్జిత:|
ఉమామాతా పితారుద్ర ఈశ్వరం కులమేవచ|
కూడల చెన్నసంగయ్యా
మీ శరణులకు ఎదురులేదు, శివుని కులంకాక -చెన్న్ బసవన్న/738 [1]

జాతి సూతకం విడువదు, జనన సూతకం విడువదు
ప్రేత సూతకం విడువదు, రజస్సూతకం విడువదు
ఎంగిలి సూతకం విడువదు, భ్రాంతి సూతకం విడువదు
వర్ణ సూతకం విడువదు
వీరెలాంటి భక్తులు
పైపూతతో క్షుద్ర దేవతను చేస్తే
నోటికి బెల్లం పూస్తే
సద్గురు లింగడు ముక్కు కోయక వదలుతాడా?
కారుచిచ్చుతో గరిక గడ్డి కోయించి నట్లుండాలి భక్తి
వెనుక మెదలేదు, ముందు గడ్డిలేదు
అందువల్ల కూడల చెన్న సంగని భక్తి స్థలం
నీ శరణునికి కాక పరులకు లభించదు./ 777 [1]

మాంసపు పిండమనికాక మంత్ర పిండమనిపించాడు బసవన్న
వాయు ప్రానికాక లింగప్రాణి అయ్యాడు బసవన్న
జగద్భరితుడనే కీర్తిని కాంక్షించక, శరణ భరిత లింగమయ్యాడు
కూడల చెన్న సంగయ్యనిలో బసవన్న - చెన్న బసవన్న/872 [1]

వారాలేడు కులాలు పద్దెనిమిదంటారయ్యా
దాన్ని మేము కాదంటాము
రాత్రి ఒక వారం, పగలొక్క వారం
భవి ఒక కులం భక్తుడొక కులం
మాకు తెలిసినది, కనుమా కూడల చెన్నసంగమదేవా -చెన్న్ బసవన్న/900 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous చందిమరసు డోహర (డొక్కల) కక్కయ్య Next