లింగాయత- నీతి శాస్త్రము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

శరణధర్మమునందు నీతిశాస్త్రమునకు అత్యున్నత స్థానము కల్పింపబడినది. నీతి అధ్యాత్మ జీవనమునందు సామరస్యము చెందవలెనని శరణులయభిమతము. భౌతిక - నైతిక మౌల్యములు ఆధ్యాత్మిక మౌల్యమునకు సాధనములగుటమాత్రమే కాదు, పగ్గమునందుండేది మూడుపోగులవలె అవినాభావసంబంధమునందుండవలెను. నైతిక శుద్ధతయొక్క సాధనము పొలమునంతయు చదను చేసినట్లు పోలమును చదను చేసి అట్లే విడిచిపెట్టిన జగత్తునకు ఏమియు ఉపయొగములేదు, చెడుపు కూడకాదు; అయితే పొలమును స్వచ్చము చేయక విత్తనము వేసిన, పంటకు బదులుగ పనికిరాని మొక్కలు పెరిగి, కాలు వెట్టుటుకు కూడ వీలులేనట్లు తొందరకలుగను. అట్లే దేవునియందు, ధార్మికమౌల్యములందు విశ్వాసముంచని నీతిమంతుడు నేలను శుభ్రపఱచి విత్తనమువేయని పొలమువంటివాడు. అతనినుండి మంచి చెడు రెండును కలుగవు. దేవునియందు విశ్వాసముంచి వేయారు రూపాయలను గుడిగోపురములకు ఖర్చుచేసినను నైతిక శుద్దతలేని వ్యక్తి అశుభ్రమైన నేలయందు విత్తిన విత్తనమువంటివాడు కావున ఆడంబరము కల ఆధ్యాత్మముకంటె శుద్దచారిత్రమునకు శరణులు ఎక్కువ విలువ ఇచ్చుచున్నారు. నాస్తికుడు దేవుని నమ్మక, దాన ధర్మములను చేయకయున్నచో అతనికి వైయుక్తిక పాపము కలుగవచ్చును. ముక్తిసుఖము దొరకకపోవచ్చును. కాని, ఇంకొకడు ఆస్తికుడైనను కూడా నైతిక బలములేకున్నచో అతనినుండి సమాజమునకు కీడు కలుగును. కావున నీతికి శరణులు చాల పెద్దస్థానమునిచ్చియున్నారు. వ్యాఖ్యమేరకు సంప్రదాయముకాని, ఆడంబరము కల దాన ధర్మములు కాని నీతికాదు. ఇతరులు మనకు ఏమి చేయకూడదని ఆశింతుమొదానిని మనము ఇతరులకు చేయకుండుటే నీతి. ఇతరులు మనకు ఏమి చేయవలెనని అవేకింతుమో దానిని మనము ఇతరులకు చెయుటయే నీతి. “తన్నంతే పరర బగెదరే కైలాస బిన్నాణవకు సర్వజ్ఞ" , “నాకు ఎవరును మొసము చేయరాదు. నా భార్యను తాకరాదు, నా ధనమును అపహరింపరాదు” అని ఆశించునటు తాను కూడ ఇతరులకు మోసము చేయక, వరస్త్రిని, పరద్రవ్యమును ముట్టకయున్నచో అదియే నీతి. “నన్ను అందర ప్రితితో చూడవలెను, గౌరవింపవలెను, కష్టమునందు సహాయము చేయవలెను". అని ఆశించు వ్యక్తి తాను కూడా అందరిని గౌరవించి, ఇతరులకు కష్టకాలమువచ్చినప్పుడు వారికి సహాయ హస్తమును ఇచ్చుటయే నీతి. నీతియొక్క భద్రమైన బునాదిమీద ఆధ్యాత్మిక మందిరమును శరణులు కట్టుటకు ఆశింతురు.

నైతిక మౌల్యములందు మిక్కిలి ప్రాముఖ్యమును ఇచ్చుట సత్యమునకే. చీకటియింటియందు వస్తువులనెట్లు చూడలేవో అట్లు అసత్యమను చీకటియున్నప్పుడు దేవుని కరుణయు గోచరము కాదు. కావుననే శరణులు ఇట్లు చెప్పుదురు.

సత్యద మనెయల్లి శివనిర్పనల్లదే
అసత్యద మనెయల్లి శివనిర్పనె?

ఇల్లిల్ల నోడిరో! ఇదు కారణ
నమ్మ అఖండేశ్వర లింగవనోలిసబేకాదడే
సత్యవనే సాధిసబేకు కాణిరో!

శివకారుణ్యమను గంగాజలము మానవజన్మయను ఘటమునందు నిండవలెనన్నచో అసత్యమనుగాలి బయటికి పోయియే ఉండవలెను. కాబట్టి మన జీవనసూత్రమెట్లుండవలెను?

దిటవ నుడివుదు, నుడిదంతే నడేవుదు
హుసియ నుడిదు నడెదు తప్పువ ప్రపంచయనొల్ల
కూడల సంగమదేవ (బషహె.వ. 2097)

అసత్యము పలుకుచు లింగమును పూజించిన అది సారహీనమైన విత్తనమును నాటి ఫలమును పొందునటి వ్యక్తమైన సాహసమువంటిది, నడత - మాట ఒకటియగుటయే జీవనముయొక్క పరమసిద్ధియని శరణులు నిక్కచ్చిగ చెప్పుదురు.

శరణులు ప్రాముఖ్యమునిచ్చు మఱియొక. తత్వమేదనగా అహింస. శరీరముతో, వచనముతో, మనస్సుతో - ఈ మూడింటితోను హింస చేయరాదు. తన శరీర రక్షణకై, తన బ్రదుకుకై అనేక ప్రాణలను చంపి తినుట, దరిద్రులను పిడించి శ్రీమంతుడగుట మహాపరాధము. మాటయందు మిక్కిలి కాఠిన్యముతో నౌజన్యములేకుండ నాలుకకు అడ్డులేక సదా ఇంకొకరిని బాధించుచు ఉండువాడు మొదటి హింసావాదికంటెను హీనుడు. సమాజమునకో, శీక్షకో, దుర్భలతచేతనో భయపడి శరీరముతో హింసింపక, మాటతోను, సౌజన్యశీలుడై, మనస్సునందు మాత్రము ద్వేషముతో క్రుంగుచు అందరిని శపించువాడు, వీరందఱికంటెను ఎక్కువ హింసావాది ఎందుకనగా - మొదట ఇతని మనస్సు, జీవనము కలుషితమై. తరువాత ఇంకొరికి కీడు కలుగును. ఈ మూడు విధముల హింసను చేయకున్నమాత్రమే అతడు శరణుడు

ఇరివుదు కడివుడు కొలువుదు
మలదేహిగళిగల్లదె నిర్మల దేహిగళిగుంటే? (ఘట్టవాళయ్య పు. 209 వ.సా.సం)

జాలగారమోబ్ళ జలవహెక్కు శోధిసి
హలవు ప్రాణియ కొందు నలినలిదాడువ
తన్న మనెయలొందు శిశు సత్తడే
అదక్కే మరుగువంతే అవకేకే మరుగను?

జాలగారన దుఃఖ జగకెల్ల నగెగెడె
ఇదు కారణ, చెన్నమల్లికార్జునయ్యన భక్తనాగిర్దు
జీవ హింసెయ మాడువ మాదిగరనేనెంబెనయ్య? (అక్కమహాదేవి పు. 208, స.సా.సం)

బెస్తవాడు వలపన్ని చేపలుపట్టును. అవి ఎక్కువగా దొరకి తన చేతులలో చచ్చినట్లంతయూ ఆనందించును. కాని అదే వ్యక్తి తన బిడ్డ చచ్చినప్పుడు ఎంతో దుఃఖించును. తన బిడ్డవలెనే చేపకునూ జీవమున్నదని దానికై ఎందుకు దుఃఖింపడు! తనవలెనే వరులను చూచుకొనుట నీతి, ఈ అహింసాతత్వము నీతితో బాటు శరణధర్మమందు ఆధ్యాత్మికమైన బునాదివై కట్టబడియున్నది.. నీ పొరుగింటివానిని నిన్నువలెనే ప్రేమతో చూడుము అని ఏసుక్రీస్తు చెప్పగా నిన్ను వదలి మిగిలినవారినందరినీ లింగజంగమమని దేవుడని ప్రేమతో చూడమని బసవణ్ణగారు చెప్పుదురు. అనేక నాస్తిక ధర్మములు అహింసను బోధించును. సృష్టికర్తనొకనిని మాత్రము అని ఒప్పుకొనుటలేదు కావున ఇట్లు చెప్పుచున్నవి. ప్రాణులకు సకల జీవులకు నీకున్నట్లే సుఖదుఃఖ సంవేదనలు వుండుటవలన వానిని హింసింపవలదు ఆస్తిక ధర్మమైన లింగాయత ధర్మము పరమాత్ముని అంశను జీవకోటులన్నియూ ధరించియుండుటవలన వానిని హింసింపవలదు. హింసించినచో నీవు దేవునే హింసించినట్లగును” అని చెప్పును.

నానొందు సురగియ ఏనెందు హిరివెను
ఏనకిత్తు ఏన ఇరివెను?
జగవెల్ల నీనాగెప్పె కాణా రామనాథా.

పరమాత్మ ఓతవ్రేతముగ సకల జీవరాసులయందు నిండియున్న కారణముగ వానిని హింసించి అతనిని నొప్పింపరాదు. చన్నమల్లికార్జున భక్తుడైన వానికి జీవ హింస చేయరాదను నియమముకలదు. కావుననే శరణులు “మాదిగను కొల్లువను, హోలెయను హోలసు తిన్నువను” అని జాతివాచకముగ చెప్పక “కొల్లువవనే మాదిగ, హోలసు తింబువవనే హోలెయ" అని గుణవాచకముగ చెప్పుదురు. ప్రాణులను చంపుట హింస; చంపినదానిని తినుట అనాచారము - ఈ రెండిటికీని దూరముండవలెనను శరణుల సదాచారము. కాబట్టి వారు దయకు కేంద్రస్థానమునిచ్చి యున్నారు.

దయలేని ధర్మమది యట్టదయ్యా?
దయయే వలయు సమస్తజీవుల యెడ;
దయయే మూలమయ్యా ధర్మమునకు;

కూడల సంగయ్య ఇటగాక ఒల్లడయ్యా (247)

దయను చూపక, ప్రాణిహింసకు అవకాశమిచ్చు ధర్మము మానవీయతాదృష్టితో ధర్మమే కాదు అని బసవణ్ణగారి అభిప్రాయము. దయాగుణ అహింసాతత్వమే ధర్మమునకు కేంద్రశక్తి కావలెనని వారి అభీప్స.

హింసను మాటతోనూ నివారింపవలెను. చేతితో కొట్టిన దెబ్బకంటే మాట దెబ్బ చాలా తీక్షమైనది. అంతేకాక ఖర్చుకందాయములేక మన మంచిమాటలతో ఇంకొకరిని సంతోష పరచగల సదవకాశమున్నప్పుడు దానిని తప్పించుట ఎందుకు? తన పుణ్యపాపములకు తానే కారణము.

పుణ్యపాపములనుట తమయిచ్చ కంటరే;
అయ్యా యనగా స్వర్గము; ఓరీ యనగా నరకము;

దేవా, భక్తప్రియా, స్వామియను పలుకులందు
కైలాసముండే కూడల సంగమదేవా (బ.షువ 240)

మానవుడు తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు. మరియెవరూ అతని పతనమునకు కారణము కారు. ప్రేమతో అందరిని ఆదరించిన అందరి బంధువు, ద్వేషించిన శత్రువు. కావుననే బసవణ్ణగారు సదా “బాగిద తలెయ ముగిద కైయ్యాగిరిసు' అని దేవునియొద్ద వేడుకొనును. ఎవరైననూ మనలను చూచుటకు కోరివచ్చిన, వచ్చినవారు కావలసినవారు కాని, అక్కర్లలేనివారుకాని వారిని సౌజన్యముతో చూడవలెను.

రా రండేమికావలె సుఖముండిరే యన
ఆరిపోవునే మిమేని సిరి;
కూర్చొనుడన ధర క్రుంగిపోవునే?
తకణమే బల్క తల బ్రద్ద లగునే!
లేమియున్న ఒకటి గుణము లేకయున్న
పడవైచి ముక్కుకోయక మానునే ?
కూడల సంగమదేవుడు. (241)

వచ్చినవారిని ప్రేమ సౌజన్యముతో “బాగున్నారా” అనినగున సంపద తొలగిపోదు. "కూర్చొనుడు” అని చెప్పిన నేల క్రుంగి పోదు. వచ్చిన వెంటనే మాటలాడించిన మన గౌరవమునకేమియూ లోపమురాదు. వారికి ధన సహాయము చేయక పోయిననూ ప్రేమతో మాటలాడునటి ఒక సద్గుణమున్న చాలును,

మనస్సునందు కూడ మనకు కీడు చేసినవారి విషయమున ద్వేషభావన పెరుగరాదు. తనువు కోపము మన వ్యక్తిత్వమునకు లోపము తెచ్చిన మానసిక కోపము బుద్ధిని మలినము చేసి అంతరంగమును కలుషితముచేయును. ఇట్టి కలుషిత అంతరంగముతో పూజచేసిన దేవునకది సహ్యము కాదు.

సదాచారము సద్బక్తి లేని వారిని మెచ్చడయ్యా
వారి పూజలు వ్యర్థమయ్యా, వారు భూమికి భారము
వారు దినదినము చేయు ప్రాయశ్చిత్తము
వారికేగాని శివుడు మెచ్చడయ్యా (649)

కాబట్టి ఈ అన్నికారణములవలన లింగాయతుడు విశ్వాకారమునందు ఇష్టలింగమును పూజించు కారణమువలన దేవుని సృష్టియందుండు ప్రతి జీవియూ అతనికి శ్రేష్ఠుడే. అతడు సకల జీవరాసులకు మంచినే కోరవలెను. మనుష్యలను ప్రేమించుట మాత్రమే కాదు, ప్రాణులనూ ప్రేమింపవలెను. ఎవనికి ప్రాణమును సృజించు శక్తిలేదో వానికి ప్రాణములాగుకొను హక్కు కూడా లేదు. హక్కు లేక చేసిన దేవుని న్యాయాలయమునందు అతనికి ఉగ్రశిక్ష. కావున అతడు నరహత్య, ప్రాణిహత్యమున్నగు హింసనుండి దూరముండవలెను. అన్ని జీవులయందు అనుకంపమును చూపవలెను. దీని సంకేతముగ మాంసమును ముట్టక, శాకాహారియై, మద్యమును ముట్టుక సదాచారియైవుండవలెను.

శరణులు మహత్వము ఇచ్చు మరియొక తత్వమేదనగా “నైతికతత్వ" పొరుగెత్తు పామునకు భయపడక, అగ్నిజ్వాలకు వెరువక, కత్తియొక్క చూవైన మొనకు భయపడక వారు రెండింటికి మాత్రము చాలా భయపడుదురు. అవి ఏమనగా పరధనము, పరస్త్రీ, శరణ ధర్మమునందు పాతివ్రత్య సతీవ్రతములకు కావలసినంత మహత్వము ఇవ్వబడినది. ఇందు ప్రవృత్తి - నివృత్తులను రెండు విధములను చూడవచ్చును. గృహస్తుడైనవాడు తన సతి విషయమున నిష్ఠావంతుడై ఆమె తప్ప మిగిలినవారందరూ తల్లులని తెలియవలెను. ఇది ప్రవృత్తి మారము. సంన్యాసియైనవాడు జగత్తునందలి స్త్రీలందరిని తల్లి గౌరి, దేవి అని తెలియవలెను. ఇది నివృత్తి తత్వము. ప్రవృత్తి తత్వము మేరకు “పరస్త్రీయ నుడిసబేడ” అని అనగా నివృత్తి ,తత్వముమేరకు “స్త్రీయ నుడిసబేడ” అనియగును దీనికి కొన్ని ఉదాహరణములను ఇవ్వవచ్చును.

పరికింపకు, పలుకరింపకు పరస్త్రీల చేరకురా
గొఱ్ఱె వెంట నడచు కుక్కరీతి వెంటాడకురా
ఒకయాశకు వెయ్యేండ్ల నరకము తప్పదురా
కూడల సంగమదేవా

బ్రహ్మద మాతనాడీ కన్నెయర కాల దేసెయల్లి కుళితల్లి
పరబొమ్మద మాతు అల్లి నిందితై ఎందనంబిగర చౌడయ్యా (పు. 213, వ.సా.సం)

చూచిన కడయెల్లా మనసీడ్చెనా
ఆన నీ యాన నీ ప్రమథుల ఆన
పరవధువును మహాదేవియందు
కూడల సంగమ దేవా (బ.షవ. 446)

తనపురుషుడు కాని అన్యులను కుదృష్టితోచూచిన, తనసతి కాని అన్యస్త్రీలను కుదుష్టితో చూచిన అది అక్షమ్య అపరాధము. అఘోర నరకమునకు సాధనము. కాబట్టి ఇట్టి పాపకార్యములను చేయగోరు అంగాంగములున్నచో వానిని నిష్క్రియులగునట్లు చేయమని దేవునియొద్ద ప్రార్థన కూడ చేయుచున్నారు.

అటు నిటు కదలకుండ అవటిని సేయుమయ్యా తండ్రి;
చుట్టి సురగి చూడునటు గ్రుడ్డిని సేయుమయ్యా తండ్రి;
అయ్యా అన్యంబు వినకుండా చెవిటిని సేయుమయ్యా తండ్రీ,
నీ శరణుల చరణముల దప్ప అన్య
విషయముల కీడ్వకుమా కూడల సంగమదేవా (59)

జీవనమునందు ఎన్నో నిందలూ, వందనలూ వచ్చుచున్నవి. మనమేమియూ తప్పుచేయకున్ననూ ఎవరికినీ కీడును కోరకున్ననూ కూడ కొందరు. ఊరక నిందింతురు, ద్వేషింతురు, అట్లు నిందించువారిని బంధువులనియూ, తల్లి తండ్రులనియూ, జన్మబంధువులనియూ, తెలిసికొనవలెనను. సహనమును బసవణ్ణగారు నేర్చుచున్నారు. ఎవరైననూ తమను వెనుకనుండి నిందించుచున్న దానిని ఎవరైననూ వచ్చి చెప్పిన తాను సంతోషపడవలెనట. ఎందుకనగా మనకేమియూ ఖర్చులేక మనను నిందించి నిందించి కొందరికి ఆనందమగుచుండగ వారి సంతోషమునకు మేము కారణమైతిమిగదా అని సంతోషించవలెనట. వారియెడకొంచము కూడ ద్వేషము చూపక వారిని శరణులు అని భావించి నమస్కరింపవలెను. ఇది బసవణ్ణ్ణగారు నేర్పు ఆత్యంతిక సహనము.

తనువును బాధించు దుశ్చటములు మనస్సునకు సంబంధించిన దుర్గుణములు - ఈ రెండింటినుండి నిర్మూలనము పొందినప్పుడే దైవీ కారుణ్యము ప్రవహించును.

నోటి చపలత మద్యమాంసములు తిందురు;
కంటయాశకు పరకాంతగవయుదురు;
లింగలాంఛనధారి యగుటచే ఫలమేమి?
లింగపథము దప్పువారు; జంగమముఖమునుండి
నిందవచ్చిన కొండమారికీ బలియాట తప్పదు
కూడల సంగమ దేవా (106)

చెంప నెరసి చిబుకమలలై మేను గూడు కాక
మున్నె; పల్లుడుల్లి వెన్నువంగి
పరుల నాశ్రయింపక మున్నె
కాళ్ళవైన కేలనూది కోలు బట్టకమున్నె
ముప్పుచే నొప్పు తప్పక మున్నె
మిత్తముట్టక మున్నె కొల్వుమా
మా కూడల సంగమ దేవుని (బ.షవ. 161)

ఇట్లు దుశ్చట దుర్గుణములు రెండింటినుండియూ సాధకుడు ముక్తుడు కావలెను. నీతిశాస్త్రమునకు అధ్యాత్మను చేర్చిన ఒక వచనమును బసవణ్ణగారు సూత్ర రూపముగ ఇచ్చియున్నారు. అది లింగాయత ధర్మపు సూత్రము మాత్రమే కాదు, నీతిశాస్త్రసారము.. దాని మర్మమును తెలిసి నీతి శాస్త్రముయొక్క ఈ విభాగమునకు పూర్ల విరామమియ్యవచ్చును.

దొంగలింపకు, చంపకు, కల్లలాడకు;
కోపింపకు, పరులకసహ్యపడకు;
పోగడ కొనకు; పరుల తెగనాడబోకు
ఇదే అంతరంగశుద్ధి; ఇదే బహిరంగశుద్ధి
ఇదే మా కూడల సంగయ్యను మెప్పించు గతి (బ.షవ. 235)


సామాన్య కాయక జీవియొకడు “నేను ఏ యోగమును ఎరుగను, తపస్సునకు సమయము లేదు, అట్టుండగ నావంటివాడు దేవునికి ప్రీతిపాత్రుడు కానా” అని ప్రశ్నించినపుడు బహుశః - అప్పగారు అటి శ్రీసామాన్యనొక్కణికి ఈ సప్తశీలములను చెప్పినట్లు తోచుచున్నది. తనువు, వాకు మనస్సు, వీనిలో దేని చేతనూ దొంగతనము చేయ వీలకాదు. తనకు ఆవశ్యకమున్నదానికంటే ఎక్కువగా ఒకమెతుకునూ, ఒక వస్తువునూ, రాష్ట్రీయ సంపత్తును దొంగిలించి పెట్టుకొనిన, సంగ్రహించిన అది పెద్ద దొంగతనము. మరియొకరికి కనిపింపక ఒక వస్తువును తీసికొని అబద్ధమని సాధించిన అది శారీరిక చౌర్యము. పరస్త్రీ సౌందర్యమును ఎడతెగక చూచుట కన్నుతోనగు చౌర్యము, వెనుకనుండి అనుకొన్న అది నాలుకకు చెందిన దొంగతనము. ఎవరికి తెలియక వినిన అది చెవివలినకలుగు చౌర్యము. మనస్సునందు ఒక వస్తువు విషయమై వివేకకమునకు విరుద్ధముగ చింతించిన అదియూ దొంగతనమే. ఇంకొకరు తినవలసిన ఒక కబళమును అనావశ్యకముగ తినిన అదియూ చౌర్యమే. ఇట్టి అన్నివిధములయిన చౌర్యములనుండి దూరముండవలెను.

శరీరము, మాట, మనస్సు - వీనిలో దేనిలోను హింస చేయరాదు. అసత్యమును చెప్పరాదు. కోపించి, ద్వేషించి అంతరంగమును మలినము చేసికొనరాదు. మనకంటే తక్కువవారిని చూచి తిరస్కర్తింపరాదు. విద్యయందు, బుద్ధియందు, సంపదయందు - వీనిలో దేనియందైనను మనకంటే తక్కువ అంతస్తునందుండువారున్నచో - వారి విషయమున అనుకంపము, వాత్సల్యమును చూపవలెనే కాని తిరస్కరింపరాదు. కష్టమునందుండువారు, రోగులు, దీనులు - ఇటివారిని చూచినప్పుడు అసహ్యభావమును పూనరాదు. స్వప్రశంసను చేసికొనుచు ఇతరులను నిందింపరాదు. ఎవరైనను తప్పు చేసిన ఎత్తి పొడుపు మాటలాడి వారిని హీనముగా చూడరాదు. తప్పు చేయువాడు మానవుడు. చేసిన తప్పును ఎత్తి చూపి ఎత్తి పొడుపు మాటలాడువాడు రాక్షసుడు. చేసిన తప్పును ఆదరముతో చూపి సరిదిద్దుకొనుటకు అవకాశమిచ్చువాడు దేవమానవుడు. మహాత్ముడు. తప్పు చేసినవారికి అవమానము కావలెనని కోరకవారిని అంతఃకరణపూర్వకముగ సరిదిద్దవలెను. ఇన్నిలక్షణములు అలవడినప్పుడు అదే అంతరంగశుద్ధి కూడల సంగమ దేవుని సంతోషింపచేయు పరమసాధనము.

మనుష్యనందుగల అన్ని కోరికలు దైవీముఖముగ ప్రవహింపవలెను, స్త్రీల విషయమందు వ్యయమగు కామము లింగముఖముగా ప్రవహింపవలెను. ఇతరుల విషయమందు ప్రవహించు క్రోధము కరణములను జయించుటయందు వ్యక్తము కావలెను. తనుమనధనములందు సీమితమై ప్రవహించు లోభము పాదోదక ప్రసాదము, గురువుననుగ్రహము పడయుటయందు గురు - లింగ -. జంగముల ఆరాధనయందు వ్యక్తము కావలెను. మహాత్ములయందు, పెద్దలయందు అహంకారమును చూపకదానిని స్వాభిమానముగ మార్పు చేసి, సత్యతత్వములను ప్రసారము చేయుటయందు చూపవలెను. ఏ ప్రాణులయందును మత్సరమును చూపక స్త్రీ - బంగారు - మన్ను - వీనియందు చూపి వానిని తిరక్కర్లింపవలెను. ఇటు అన్ని శారీరిక మానసిక గుణములు కూడా దైవీ ప్రపంచమునందు ప్రవహింపవలెను. ఇది సాధ్యము కావలెనన్న, ఏదైన ఒక మంచి తత్త్యము విషయమున జ్ఞానముండిన చాలదు. దానిని ఆచరించు సంకల్పము కావలెను. కేవలము సంకల్పమున్నను చాలదు. అలవాటు చేసికొనునట్టి క్రియాశీలత కావలెను. అప్పుడు మాత్రమే నైతికత పూర్ణముగ అలవడును.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previousకరుణోదకము (పాదోదకము) - ప్రసాదములింగాంగయోగం, త్రాటక యోగం, (శివయోగము)Next
*