బసవేశ్వరులవారి సంక్షిప్త జీవన చరిత్ర (1134-1196)

బసవేశ్వరుడు సృష్టికర్త పరమాత్ముని సంకల్పముచే భువిపై అవతరించి విశ్వమునందలి మానవాళి తరించుటకు నూతన ధర్మమును ప్రసాదించారు. నాటి ప్రసిద్ధిగాంచిన ఇంగుళేశ్వర సమీప బాగెవాడియందు శైవబ్రాహ్మణ దంపతులైన మాదరస-మాదలాంబికల పుత్రుడుగా ఆనందనామ సంవత్సరమందు వైశాఖ మాసపు అక్షయ తృతీయ రోజున రోహిణి నక్షత్రమునందు క్రీ.శ. 1134, ఎప్రిల్, 30వ తేదిన జన్మించారు. అంధవిశ్వాసములు, జడ సాంప్రదాయములను ఒప్పక సత్యాన్వేషుకులై తల్లిదండ్రులను, బంధుబాంధవులను తన 8వ ఏటనే వీడి విద్యాకాంక్షీయై కూడల సంగమ గురుకులమున చేరిరి. శాస్త్రాధ్యయనము, యొగాభ్యాసమును గడపి యవ్వనమున కాలిడిన సమయంలో జనులందు గూడుకట్టుకోనిన మూఢ నమ్మకములు, ప్రేళ్ళూనినకులవ్యనస్థను గాంచి మనస్సునొచ్చి పరిహారమును వెదక దొడగిరి. మకర సంక్రాంతి రోజున కూడల సంగమేశ్వరాలయమున పరమాత్ముని దివ్యదర్శనమును బడసి అనుగ్రహమును పొందిరి. నిరాకార "దేవునికి మనుష్యుల, ప్రాణుల ఆకారము ఊహించునది సరియైనదికాదు" అను భావము స్ఫురించి, దేవుని సాకార కృతియే బ్రహ్మాండము, అది గోళాకారమునందు గలదు. అందుచే నిరాకార దేవుని విశ్వదాకార రూపగు ఇష్టలింగము రూపున పూజించుట సరియైనదని తెలిపిరి. పరమాత్ముని గురుతగు ఇష్టలింగము మానవుని జాతి, వర్ణ, వర్గ భేదములను తెంచి శరణునిగా చేసెడి సాధనమగుటకు దానిని గణలాంచనముగా చేసిరి.

దివ్యానుభవము బడసిన బసవేశ్వరుడు నవసమాజనిర్మాణపు రేఖలను తనమనముందు పొంది కల్యాణ రాజధానిని ప్రవేశించిరి. అంతకుక్రితమే బిజ్జళరాజు యొక్కప్రధానమంత్రిగా గల తన మేనమామ బలదేవరసుని కూతురు నీలగంగాంబికను వివాహమాడియుండిరి. మొదట రాజాస్థానములో కరణిక వృత్తిని, భండారి (ఆర్థిక మంత్రి) పదవిని నిర్వహించిన బసవేశ్వరుడు మేనమామ గతించుటతో చాళుక్క సామ్రాజ్యమునకు దండనాయకడు (ప్రధానమంత్రి) ఆగుట జరిగెను. దైవనిర్ణయముతో అధికారము తొడుకాగా అనుభవమంటపమును కట్టించి, అందు శూన్యపీఠమును నెలకొల్పి నిరాటంకముగా కులమతరహితముగా, స్త్రీ-పురుష వివక్షత లేక ధర్మప్రచార కార్యమును నిర్వహించిరి. ఇష్టలింగమను గణలాంఛనము ధరింపజేసికొనిన వారెల్లా ఒకే కులజులనిచాటిరి.

పుట్టుకచే బ్రాహ్మణుడగు లింగవంతుడగు మధువరసుని కూతురు లావణ్యవతి వివాహము పుట్టుకచే మాదిగయగు లింగవంతుడగు హరళయ్య కుమారడు శీలవంతునితో జరిగిన కారణముగా బసవేశ్వరుడు ప్రవేశపెట్టిన క్రాంతికారి సంస్కరణొద్యమమే అంతర్వర్ణ వివాహమునకు కారణమైనదని రాజుకు చాడిలుచెప్పి జాతివాదులు కుట్రతో బసవేశ్వరులవారికి దేశబహిష్కార శిక్షను విధింపజేసిరి. బసవేశ్వరుడు కల్యాణ రాజధానిని వీడి తన విద్యా భూమి, తపో స్థానము కూడలసంగమమును చేరుకొనిరి. తను వచ్చిన పని పూర్తియైనదను దైవాజ్ఞ తెలిసినంతనే సంగమేశ్వర దేవాలయం ఎదుట, కృష్ణా-మలప్రభా నదుల సంగమస్థానపు వొడ్డున ధ్యానముద్రలో కూర్చోని స్విఇచ్ఛతో దేహమును చాలించి నళనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి రోజున క్రీ. శ. 1196లో తన 62 సంవత్సరాల ప్రాయంలో పరమాత్ముని సన్నిధిని చేరుకొనిరి. బసవేశ్వరుడు అతడి సమకాలీన శరణులు అనుభవముతో పలికిన వచన సాహిత్యము మానవాళికి మార్గదర్శకమై నిలచినది.

Reference:

గ్రంథ ఋణం: బసవ తత్త్వ ప్రకాశిక సావనీరు, ప్రకాశకులు:బసవ ధర్మ కేంద్రము, మహబూబ్‍నగర (పాలమారు), తెలంగాణ.

సూచిక (index)
Previousవిశ్వగురు బసవేశ్వరులవారిపై ప్రముఖుల ప్రశంసభహురూపి చౌడయ్యగారి బసవ స్తుతి వచనముNext
*