Previous తలపై తల ఉంటుందా లింగాయత ధర్మం Next

ఆచార భ్రష్టుని గురించి

*

॥ ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

“బసవాది శరణుడైన కీలారద భీమన్న గారి వచనము"

"లింగ బాహ్యుడిని, ఆచార భ్రష్టుని,
వ్రతము తప్పినవాడిని,
గురులింగజంగముని చంపిన వాడిని,
పాదోదక ప్రసాదముల దూషకుని,
విభూతి రుద్రాక్షల నిందించిన వాడిని - చూచిన యెడల,
శక్తి యున్న సంహారము చెయ్యవలె,
శక్తి లేనట్లైతే కన్నులూ చెవులూ మూసుకొని,
శివమంత్రాన్ని జపించాలి.
అదీ కాకపోతే; ఆ స్థలమును వదిలి వెళ్ళాలి.
అటుల చెయ్యకున్న కుంభీ పాక నాయక నరకములో
పెట్టును శ్రీ గురు సిద్ధేశ్వరుడు."

ఈ పై వచనము పంచాచారములో ఒక్కటైన గణాచారమును గురించి చెప్పడం జరిగింది. దానికి పూరకంగా ఆచారము అంటే ఏమిటి? పంచాచారాలు (లింగాచారము, సదాచారము, శివాచారము, గణాచారము, భృత్యాచారము) అంటే ఏమిటి? వాటి మహత్వము గురించి గమనిస్తే ఈ వచనము యొక్క ముఖ్య ఉద్దేశ్యం అర్థమౌతుంది. చిన్మయ జ్ఞాని చెన్నబసవేశ్వరుని వచనములో చూద్దాం పంచాచారాలు అంటే ఏమిటో...?

"లింగ బాహ్యుడిని:”
అంటే ఒక రకంగా చెప్పాలంటే లింగమును అంగము (దేహము) నుండి తీసి బయట పెట్టేవారు. ఇంకొక అర్ధములో అంగము పై లింగాన్ని ధరించినప్పటికీ దాని మర్మాన్ని గ్రహించనివాడిని లింగబాహ్యుడని చెప్పవచ్చు.

లింగమను అంగము నుండి బయట పెట్టినవాడు అనగానే మొదలు ఆయన లింగాన్ని "ఆయతం" చేసుకొని తరువాత వదిలివేసిన వాడు అని అర్థం వస్తుంది. శరణులు ఏది చెప్పిననూ ఇష్టలింగసంబందికై నొక్కి చెబుతారు. లింగమును ధరించిన వారికి ఎటువంటి ఆంక్షలు (బైండింగ్స్) లేవు. పెళ్ళైన స్త్రీలు తన భర్తకు కాక అన్యపురుషున్ని చూచినా అది అనైతిక సంబంధం (రంకుతో సమానం) అని చెప్పడం జరిగుతుంది. బసవాది శరణుల నీతి సంహితలో పెళ్ళైన పురుషుడు కూడా పరసతిని చూడడం కూడా అనైతిక సంబంధమే అవుతుంది. కాని, కన్య-వరుడు అంటే పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలు, ఎంతమందికి చూసిననూ పర్వాలేదు. ఎందుకంటే వారికి ఇంకా సంబంధం కుదరలేదు కాబట్టి. అలాగే ఎవరైతే ఈ భక్తి మార్గమునందు ఉండాలనుకుంటారో వారికే శరణులు హెచ్చరిస్తారు.

“ఆచార భ్రష్టుని:”

బసవ ధర్మములో (లింగాయత ధర్మములో) మూడు స్థంబాలైన ఆష్టావరణాలు, పంచాచారాలు, షట్-స్థలములు, వాటికి, - అష్టావరణాలే అంగముగాను, పంచచారాలే ప్రాణముగాను, షట్ స్థలాలే ఆత్మగా పరిగణిస్తారు. మనుష్యుడు మానవునిగా మారుటకు విచార శీలత (ప్రజ్ఞ) ఎంతో అవసరం. ప్రజ్ఞా పూర్వకంగా నడవడమే ఆచారము. విచారము- ఆచారమూ రెండూ అవసరము. లేకపోతే మానవుడు నరుడిగానే ఉంటాడు. ఆచారమే- స్వరం, అనాచారమే-నరకము. అని చెప్పారు బసవణ్ణ గారు. ఆచార సహితుడు భక్తుడు. అనాచార సహితుడు నరుడు. ప్రాణప్రదంగా ఉన్న పంచాచారాలను ఒకే ఒక్క వచనములో చెన్నబసవణ్ణ గారు ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది.

"లింగాచారము, సదాచారము, శివాచారము, గణాచారము, భృత్యాచారములే పంచాచారముల యొక్క ఆచరణములు. అది ఎలాగంటే-

ఇష్టలింగమును తప్ప అన్యమునకు వెళ్ళకుండడమే లింగాచారము.
సత్య శుధ్ధ కాయకముచేత తెచ్చి గురువు-లింగము-జంగమాలకు అర్పించి సత్యశుద్ధుడై యుండడమే సదాచారము.
శివభక్తులలో కులము, గోత్రము, జాతి, వర్ణాశ్రమములను పాటించక వారిచ్చినది స్వీకరించడమే శివాచారము.
శివాచారముల నిందను వినకుండా ఉండడమే గణాచారము.
శివశరణులే గౌరవనీయులని తానే సేవకుడను అని భయభక్తులతో ఆచరించడమే భృత్యాచారము ఇటుల పంచాచారములు కల్గిన పరమసద్బుక్తుని వేడింది వరించేట్టు కరుణించుమా ప్రభువా కూడలచెన్నసంగమదేవా.!"

ఈ విధంగా పంచాచారము గురించి వివరించారు. ఈ పంచాచారములోని గణాచారాన్ని, కీలారద భీమన్న గారు చెప్పడం జరిగింది. గురులింగజంగముల నిందను, పాదోదక ప్రసాదముల దూషణ, వీభూతి, రుద్రాక్షల అవమానమ అగౌరము అయినప్పుడు, జనాల్లో అనైతికత్వం కనపడినప్పుడు, దుష్ప్రభావాలకు లోనైనప్పుడు దానిని సహించకపోతే వాటి మహత్తుని తెలిపి వారిని సమూహంగా సరైన దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అదియే గణాచారము. గణం అంటే సమూహం, ఆచారం అంటే క్రియా, గణం+ఆచారం = గణాచారం.

ఉదా: నాటి చరజంగమ స్వరూపులు దుష్చటాలకు బలియైపోయిన వారి ఇంటికి వెళ్ళి, వారిని శిక్షించకుండా తమను తాముగా శిక్షించుకొని వారిని సరిచేసే క్రమము మహాత్వపూర్ణమైనది. అంటే, వారి ఇంటి ముందు అందరికీ కనబడేటట్టుగా ముళ్ళు చెక్కలపై నిలబడి, లేదా వారి ఇంటి స్థంబాన్ని హత్తుకొని అస్త్ర శస్త్రాలతో తనను తాను శిక్షించడం ప్రారంభించుకునేవారు. దీని ద్వారా దుశ్చటాలకు బలియైపోయిన వారు తిద్దుకొని ఇంకోసారి ఆ తప్పును చెయ్యనని ఒప్పుకున్నాకే తమను తాము శిక్షించుకొనడం మానేవారు.

"వ్రతము తప్పినవాడిని:"

ఇక్కడ వ్రతము అంటే పరవస్తువును (పరమేశ్వరుని) చూడడానికి చేసే ప్రయత్న సోపానం. దేవున్ని వరించడానికి ఆయనకై అనుభవించడానికి, పై-పైకి వెళ్ళే దివ్య పథమే ఈ వ్రతము. మనస్సుకు నచ్చినట్టుగా పలికి, తనకు తోచినట్టుగా కాకుండా, మాయా మోహాలను వదిలి, దేన్ని పట్టుకొని వెళ్ళాలో దానిని చేపట్టి గురిముట్టినప్పుడు అతడే రామేశ్వర లింగమని అక్కమ్మ తల్లి తన వచనములో చెప్పడం జరిగింది. ఆడంబరాలతో చేసే అర్చనా, పూజా, నేమము కాదు. పర-సతి పర-ధనము పర-దైవానికి ఆశించకుండా ఉండడమే నిజమైన నేమము అని సత్యక్క తన వచనములో చెప్పడం జరిగింది. ఉపవాసముతో దేహమును శిక్షిస్తూ, పాలతోనో, నెయ్యితోనో, బెల్లముతోనో, పళ్ళతోనో ఇలా అజ్ఞానముచే అర్థములేని నేమాలు చెయ్యకుండా నిజమైన నేమము చెయ్యాలని బసవణ్ణ గారు తన వచనములో చెబుతారు.

"వచ్చింది అందనేర్చుటే వ్రతము,
ఉన్నది వంచన లేక యిచ్చుటే వ్రతము,
నడత తప్పకుండుటే వ్రతము,
పల్కి బొంకనిదే వ్రతము,
కూడలసంగని శరణులు
వచ్చినప్పుడు బంధు మిత్రులందరూ
సుజ్ఞానమును అర్పించుకొనుటయే వ్రతము.”

మనకు కష్ట-సుఖాలు, సిరిసంపద-బీదరికం, గౌరవం-అపమానం ఏమి వస్తుందో దానిని భయపడకుండా ఎదురించాలి. అది కావాలి ఇది వద్దని ఎంచుకోకుండా వచ్చింది స్వీకరించాలి. మన దగ్గర ఉన్న ధనము, జ్ఞానము, మంచి ఆలోచనలు వంచించకుండా అందరికీ పంచవలెను. మంచి మార్గానికి ఎంచుకొని దానిని తప్పించకుండా చూసుకోవాలి. సత్యాన్ని మాత్రమే పలకాలి. స్నేహితులు, బంధువులు, శరణులు వచ్చినప్పుడు మనము సంపాదించిన అంతరంగ సంపత్తు జ్ఞాన ప్రసన్నతలు వారికి అందించాలి.

"గురులింగజంగముని చంపిన వాడిని:”

చంపినవారల అంటే చంపివెయ్యాలనే అనే అర్థం కాదు. (ప్రాణం తీయడం కాదు) గురువు-లింగము-జంగమమాలు ఒకే మూల వస్తువు యొక్క మూడు తత్వాలు. వాటి మహత్వమును తెలుసుకోకుండా వారలకు అవహేళన, అవమానము చెయ్యడము. చెడ్డ మాటలతో వారి మాటలకు తర్కము చెయ్యడం. అంటే, సుజ్ఞానమే గురువుని భావించక నరునిగా భావించడం. ఇష్టలింగమును పరాత్పర పరమేశ్వర స్వరూపంగా భావించక శిలగా భావించడం, జంగమత్వమును చైతన్య స్వరూపంగానూ, అనుభావిగానూ, భావించక ఒక కులం-గోత్రంగా భావించిన వారు గురులింగజంగమాలను చంపినవాడని అర్థం వస్తుంది.

“పాదోదక ప్రసాదముల దూషకుని:”

పాదోదకము అంటే, పాదము అంటే జ్ఞానము లేదా నడత, ఆచారము యొక్క సంకేతము. ఉదకము అంటే నీరు ప్రవహించే సంకేతము. అలా, గురులింగజంగమాల కరణు పులకరించేటట్టుగా పూజించాలి. ఇష్టలింగాన్ని పూజించిన పిదప, గురు పాదోదకము, లింగ పాదోదకము, జంగమ పాదోదకము, అని ఇష్టలింగముపై నిష్టతో అర్పించి స్వీకరించిన గురులింగజంగమాల పాదోదకంగా మారుతుంది. గురు- పాదోదకము కరుణా జలమని, లింగ- పాదోదకమును వినయ జలమని, జంగమ-పాదోదకమును సమతా జలమని, ఈ మూడింటి పాదోదకమును స్వీకరించాక సంచిత, ప్రారాబ్ది, ఆగామీ అనే కర్మత్రయాలు నాశనమౌతాయి. అష్టావరణములో గురువు, లింగము, జంగమము మనలోనే ఉన్నందున ఇక్కడ పాదోదకము అంటే కేవలం నీరు కాదు. పరమజ్ఞానమని శివయోగి సిద్దరామేశ్వరుని వచనములో ఈ విధంగా చెప్పడం జరిగింది.

"పాదోదకమనునది పరమేశ్వరుని చిద్రూపము చూడుమా,
పాదోదకమనునది మోక్షపు మార్గము చూడుమా,
పాదోదకమనునది పాపములను హరించును చూడుమా,
పాదోదకమనునది ప్రమథుల సుజ్ఞానము చూడుమా,
పాదోదకమనునది కపిలసిధ్ధమల్లికార్జుని మహిమ చూడుమా."

ప్రసాదము అంటే పరమేశ్వరుడు అనగ్రహించిన బ్రతుకే ఒక మహాప్రసాదం లాంటిది. గురువు లింగము జంగమమానికి ఏదేని పదార్థము కాని, అర్పితం చేసేటప్పుడు "నేను" అనే అహంకారాన్ని వీడి పదార్ధము + అనుగ్రహము కలిసి, ప్రసాదమౌతుంది. ఆ ప్రసాదము చేత ప్రసన్నతా, అనందం, ముక్తి కూడా లభ్యం అవుతుంది. ఇది ప్రసాదపు మహాత్మ్యం. ఇలా పాదోదక ప్రసాదపు మహత్తును తెలియని వారు దానిని దూషణ చేస్తూ ఉంటారు.

“విభూతి రుద్రాక్షల నిందించిన వాడిని:"

లింగాయత ధర్మీయుల లాంఛనాలలో వీభూతి ఒక ఆవరణమై ఉంది. వీభూతి ధరించిన వారికి సాత్వీకమైన కళ సొంతమౌతుంది. వీభూతి “వీ" అంటే విశేషం. "భూతి" అంటే ఐశ్వర్యం. అంటే విశేషమైన సంపత్తు వారి సొంతం.

వీభూతి ధారణ అంటేనే జ్ఞానపు సంకేతము. కామమును ఇంద్రియ వికారాలను, జ్ఞానాగ్నిలో కాల్చిన సంకేతము. అందుకే బసవణ్ణ గారు, శ్రీ విభూతి, శ్రీ రుద్రాక్షి అని అత్యంత భక్తి భావనలతో, గౌరవ సూచకంగా ఈ శబ్దాలను తమ వచనాలలో వాడారు. వీభూతి నుండి సర్వస్వం వశమౌతుంది. రుద్రాక్షలు ఒక పవిత్రమైన చెట్టు యొక్క కాయ. ఔషధీవనరులు కలిగియుండి వాటిని దేహముపై ధరించిన అది కూడా, సాత్వీకమైన కళ మనకు సొంతమౌతుంది. అంతే కాక, రుద్రాక్షి సమ్యక్ దృష్టి (సజ్ఞానపు) సంకేతం. మెడలో ధరించిన పిదప అన్యదైవాలకు తల వంచకూడదు. చేతిలో ధరించిన దాసోహభావంతో మెలగాలే తప్ప ఆశించకూడదు. తోలు పై ధరించిన పరసతికై ఆశించరాదు. చెవిలో ధరించిన శివనింద వినరాదు. అటువంటి పరమ పవిత్రమైన రుద్రాక్షి మహత్తును బసవణ్ణ గారు పై విధంగా వివరించారు.

వీభూతి రుద్రాక్ష ధరించని వారల ముఖము చూడజాలము అని చెప్పడం జరిగింది. ఇటువంటి విభూతి రుద్రాక్షల మహత్తును తెలియని వారు, అగౌరపరిచి మరియూ దానిని ధరించిన వారల పై హీనంగా నిందించేవారు అవమానించే వారూ ఉంటారు.

"శక్తి యున్న సంహారము చెయ్యవలె:”

ఇక్కడ శక్తి ఉంటే సంహారము చెయ్యవలె అంటే, చంపివెయ్యవలె నని అర్థము కాదు. వారి మనస్సును పరివర్తన చెయ్యాలి అనే నిఘూఢార్థం దాగివుంది. శక్తి కావాలి నిజమే, అంటే ఎటువంటి శక్తి? దేహదారుఢ్యం (పైల్వాన్) కాదు. ఇక్కడ జ్ఞానమే శక్తి. జ్ఞానమనే ఖడ్గము చేత ఆయన మనస్సులోని అజ్ఞానాన్ని సంహారం చెయ్యడం. అంటే దేవుని నిజస్వరూపాన్ని వివరించాలి. పరమాత్ముడు చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యం లేనట్టైతే మనము కాళ్ళూ చేతులూ కదిలించలేము. మాట్లాడలేము. మనకు ధ్వని మనకు వినపడదు. చైతన్యము లేనట్లైతే మనము శవంగానే ఉంటాము. ఇటువంటి దైవీకృత చైతన్యము మనలో ఉన్నదనే విశేషం తెలియకుండా ఉంటే జీవించి ఉన్నా శవంతో సమానమే. నడిచే శవం, కూర్చొనే శవం, తినే శవంలాగే జీవితమే ఒక శవమైపోతుంది. అనే విషయాన్ని మనదగ్గర శక్తి ఉంటే ఆ దూషకులకు చెప్పవలెను. ఒకవేళ......శక్తి లేనట్లైతే?

"శక్తి లేనట్లైతే కన్నులూ చెవులూ మూసుకొని, దేవమంత్రాన్ని జపించాలి..”

మనదగ్గర శక్తి ఉంటే ఇంకొకరి విషయం నాకెందుకని ఉదాసీనం చెయ్యకుండా ప్రామాణికంగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యవలెను. కాని, కొందరికి అటువంటి శక్తి ఉండదు. చెబితే అర్థం చేసుకోకుండా వాదానికి, పోట్లాటకై వచ్చేవారే అధికం. వారి నోటి మాటలకు బయపడి కొందరు చెప్పడానికి వెనుకంజ వేస్తారు. వారికి చెప్పడం వ్యర్థం అని భావించి కన్నులూ చెవులూ మూసుకొని బసవా బసవా అంటూ గురు/దేవమంత్రాన్ని జపించాలి అని కీలారద భీమణ్ణ గారు చెప్పడం జరిగింది.

“అదీ కాకపోతే; ఆ స్థలమును వదిలి వెళ్ళాలి.:”

అనుచిత వ్యాఖ్యలను విన్న. ఏమీ తిద్దడం వారి మనస్సులను మార్చడం అసాధ్యమైతే, అదే విధంగా వారి అనుచిత మాటలను వింటూ కూర్చోడం అసాధ్యమని అనిపిస్తే, ఆ స్థలమును వదిలి వేరే స్థలానికి వెళ్ళిపోవాలి. దానికీ శరణులే పరిహారాన్ని చూపించడాన్ని గమనించాలి. అదే వారి అనుభావము. అన్నీ కాలాల్లో అన్నీ రకాల జనాలు ఉంటారు అనేది సత్యమైన విషయం.

“అటుల చెయ్యకున్న కుంభీ పాక నాయక నరకములో పెట్టును శ్రీ గురు సిద్ధేశ్వరుడు:"

ఏ విధంగా చెయ్యకుండా అలాగే ఊరికే ఉంటే కుంభీపాక అంటే మట్టితో చేసే కుండలను కాల్చే కొలిమి. అటువంటి కొలమిలో అంటే సంకష్టాలలో కాల్చే శిక్షను పరమేశ్వరుని విధిస్తాడని ఎచ్చరిక చేస్తారు కీలారద భీమన్న శరణుడు.

*
Previous తలపై తల ఉంటుందా లింగాయత ధర్మం Next